లక్ష్మీ పూజ కానీ, రేపు దేవీ నవరాతృలలో చేసే దుర్గా పూజ కానీ- మరే దేవీ పూజ కానీ మీరు సొంతంగా- రోజూ ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ టపా రాస్తున్నాను. మీరు చేయ వలసిందల్లా " శ్రీ లలితా దేవీ " అని ఉన్నచోట మీరు పూజించే దేవత పేరు పెట్టు కోవడమే. స్త్రీ స్వరూప దేవతలకు మాత్రమే పనికి వచ్చే శ్లోకాలతో రాయబడుచున్నది. కనుక పురుష స్వరూప దేవతలకు పనికి రాదు.
ఈ టపాలో పూజ చేయవలసిన విధానంతో పాటు, లలితా దేవి పూజను కూడా రాస్తున్నాను. అది అందరికీ ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను. నిజానికి ఈ పూజా మంత్రాలతో కూడిన అనేక పుస్తకాలు బయట షాపుల్లో దొరుకుతున్నాయి. కానీ ఏది ఎందుకు చేస్తున్నామో చెపుతూ ఒకొక్క సేవ వివరిస్తే బాగుంటుంది అనే భావనతో ఈ టపా రాస్తున్నాను.
షోడశోపచార పూజ: 16 రకాలైన సేవలను చేయుటయే "షోడశోపచార పూజ" అనబడుచున్నది. మన ఇంటికి వచ్చిన అతిథిని ఏ విధంగా గౌరవంతో సేవిస్తామో అదే విధంగా మన అభ్యర్ధనను మన్నించి వచ్చిన భగవంతుని 16 రకాలైన సేవలతో పూజిస్తామన్నమాట. కుదిరితే " పూజ చెయ్యబోతున్నారా..? అయితే ఓ సారిలా ప్రయత్నించి చూడండి " అనే టపా కూడా చదవండి.
ముందుగా దైవ ప్రార్థనతో పూజను ప్రారంభించాలి.
శ్రీ దేవి పూజా ప్రారంభః
గణపతి ప్రార్ధన:
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
పార్వతీ పరమేశ్వర ప్రార్థన:
వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
గురు ప్రార్థన:
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం
ఆచమ్య:
ఓం కేశవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం నారాయణాయ స్వాహా. ( అని నీటిని తాగాలి )
ఓం మాధవాయ స్వాహా. ( అని నీటిని తాగాలి, పిదప ఆ ఎంగిలి చేతిని కడగాలి )
( నమస్కారము చేస్తూ ఈ క్రింది నామాలు చదవాలి)
ఓం గోవిందాయ నమః.
ఓం విష్ణవే నమః.
ఓం మధుసూదనాయ నమః.
ఓం త్రివిక్రమాయ నమః.
ఓం వామనాయ నమః.
ఓం శ్రీధరాయ నమః.
ఓం హృషీ కేశాయ నమః.
ఓం పద్మ నాభయ నమః.
ఓం దామోదరాయ నమః.
ఓం సంకర్షణాయ నమః.
ఓం వాసుదేవాయ నమః.
ఓం ప్రద్యుమ్నాయ నమః.
ఓం అనిరుద్ధాయ నమః.
ఓం పురుషోత్తమాయ నమః.
ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః.
ఓం అచ్యుతాయ నమః.
ఓం జనార్దనాయనమః.
ఓం ఉపేంద్రాయ నమః.
ఓం హరయే నమః.
ఓం శ్రీ కృష్ణాయ నమః.
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః .
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.
తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ
విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రియుగం స్మరామి.
సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం
యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః.
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం.
సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే.
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఉమా మహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతా రామాభ్యాం నమః. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహా జనేభ్యో నమః.
భూతోచ్ఛాటన: ( ఈ క్రింది మంత్రము చెప్పి ఆక్షితలను వాసన చూసి వెనుకకు వేయాలి. అందువల్ల మనము చేసే సత్కర్మలకు ఆటంకం కలిగించే భూతములు తొలగి పారిపోతాయి )
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః.
యేతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే.
ప్రాణా యామః : తరువాత ప్రాణా యామము చేయాలి. అనగా గాలిని పీల్చి( పూరకము), లోపల బంధించగలిగినంతసేపు బంధించి( కుంభకము ), నెమ్మదిగా బయటకు వదలాలి ( రేచకము ). ఈ ప్రాణాయామము చాలా శక్తి వంతమైనది. మన ఆయుః ప్రమాణం మన రెప్ప పాటులను బట్టీ, ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలను బట్టీ, మన నోటి నుండి వచ్చే వర్ణ సంఖ్యను బట్టీ నిర్ణయించ బడుతుంది. ఇన్ని సార్లు గాలి పీల్చి వదలిన పిమ్మట, ఇన్నిసార్లు రెప్పలు మూసి తెరచిన పిమ్మట, ఇన్ని అక్షరాలు పలికిన పిమ్మట వీడి ఆయువు తీరును అని విధిచేత రాయ బడి ఉంటుంది. మన ఆయువు తీరే నాటికి ఆ మూడూ ఒకేసారి పుర్తగును. అందుకే మన ఋషులు గాలిని పీల్చి కుంభకములోనే నిలిపి అనేక సంవత్సరములు రెప్పపాటు లేకుండా, మౌనంగా తపస్సు చేసే వారు. ఆ తపస్సు చేసినంతకాలం వారి ఆయుష్షు నిలచి ఉండేది. ఇంతటి శక్తి ఉంది ప్రాణాయామానికి. మనము అటువంటి తపస్సు చేయక పోయినా రోజూ కొంత సమయం ప్రాణాయామ సాధన చేస్తే ఎటువంటి రోగములనైనా అదుపులో పెట్టుకుని ఆ రోగ్యముతో జీవించ వచ్చును.
సంకల్పం: (భారత దేశంలో ఉండే వారికి, ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ వారికి మాత్రమే ఈ సంకల్పం పనికి వస్తుంది.)
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం- శుభే శోభనే ముహూర్తే- శ్రీ మహా విష్ణో రాఙయా-ప్రవర్తమానస్య- అద్య బ్రహ్మణః-ద్వితీయ పరార్దే-స్వేతవరాహ కల్పే-వైవస్వత మన్వంతరే-కలియుగే-ప్రథమ పాదే-జంబూ ద్వీపే-భారత వర్షే-భరత ఖండే-మేరోర్దక్షిణ దిగ్భాగే-శ్రీశైలస్య.........ప్రదేశే (హైదరాబాదు-వాయువ్య ప్రదేశం అవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇక్కడ మార్చి చెప్పుకోవాలి) - క్రిష్ణా గోదావర్యోర్మధ్యదేశే (ఇది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది)-శోభన గృహే-సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ- అస్మిన్ వర్తమానేన- వ్యావహారిక చాంద్రమానేన- (చాంద్ర మానం ప్రకారం)
....................... సంవత్సరే ( ప్రభవ, విభవ మొ..గు 60 సం. లలో ఏ సంవత్సరమైతే ఆ పేరు పెట్టాలి) (ప్రస్థుతం: విరోధినామ సం..రం )
............ ఆయనే ( ఉత్తరాయణము లేదా దక్షిణాయనము ) (ప్రస్థుతం: దక్షిణాయనం )
......... ఋతౌ ( 6 ఋతువులు- ప్రస్థుతం వర్ష ఋతువు )
............. మాసే ( చైత్రాది 12 మాసాలలో ఏదైతే అది.- ప్రస్థుతం భాద్రపద మాసం )
............ పక్షే ( పక్షాలు రెండు. అవి 1. శుక్ల పక్షం, 2 కృష్ణ పక్షం- ప్రస్థుతం శుక్ల పక్షం )
............ తిథౌ ( పాడ్యమ్యాదిగా 16 తిథులు - ఈరోజు త్రయోదశీ తిథి )
........ వాసరే ( 7 వారాలకీ సంస్కృతంలో వేరే పేర్లు ఉన్నాయి ) (బుధవారాన్ని-సౌమ్యవారం అంటారు )
........... శుభ నక్షత్రే ( ఇక్కడ ఆరోజు నక్షత్రం పేరు చేర్చాలి.) (ఈరోజు-శ్రవణా నక్షత్రం)
......... శుభ యోగే ( విష్కంభం, ప్రీతి మొ.గు ఇవి 27 యోగాలు ) (ఈరోజు-శోభ యోగం)
.......... శుభ కరణే ( బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుఘ్నం అని ఇవి మొత్తం 11 కరణములు) (ఈరోజు-తైతుల కరణం )
( వీలైతే ఈ పూజా విధానం చివరిలో ఈ సంవత్సరాలు, నక్షత్రాలు మొ.గు మొత్తం పేర్లు రాస్తాను.)
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ-
శ్రీమాన్ .......... గోత్రః- .......... నామధేయః-
ధర్మ పత్నీ సమేతోహం- ( ఇది ఆడవారు చెప్పుకోనవసరం లెదు )
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ లలితా దేవీ ముద్దిశ్య- శ్రీ లలితా దేవీ ప్రీత్యర్థం- మమ శ్రీ లలితా దేవీ అనుగ్రహ ప్రసాద సిధ్యర్థం- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూప శ్రీ లలితా దేవీ షోడశోపచార పూజాం కరిష్యే. ( అని అక్షతలు నీళ్లు పళ్లెంలో వదిలి పెట్టాలి )
టూకీగా ఈ సంకల్పం వివరణ: కలియుగం ప్రథమ పాదంలో-భారతదేశంలో- హైదరాబాదులో- నాకు శుభమును కలిగించు గృహములో- దేముని ముందు ఉన్నటువంటి నేను- ఫలానా సంవత్సర-మాస-తిథి-వార-నక్షత్ర ములు కలిగిన ఈ శుభ దినమున- ....గోత్రంలో పుట్టిన-........ పేరుతో పిలవబడే-
ధర్మ పత్నితో కూడుకున్న వాడనైన( ఆడవారు ఇది చెప్పుకోనవసరం లేదు ) నేను-
శ్రీ లలితా దేవిని ఉద్దేశించి- శ్రీ లలితా దేవి ప్రీతి కొరకు-నాకు శ్రీ లలితా దేవి అనుగ్రహం కలగడం కొరకు- శ్రీ మహా కాళీ- మహా లక్ష్మీ-సరస్వతీ స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవికి 16 రకాలైన సేవలతో కూడిన పూజను చేయుచున్నాను.
ఈ విధంగా సంకల్పించిన తరువాత కలశారాధన చేయాలి. అది తరువాతి టపాలో రాస్తాను. ఈ పూజ మొదలు పెట్టే ముందు చెప్పుకోవలసిన చిన్న కథ ఒకటి ఉంది.
పిట్ట కథ
పూర్వం రామ నాథం అనే ఒక మహా భక్తుడు ఉండే వాడు. అతడు ప్రతినిత్యం విష్ణు మూర్తి పూజచేస్తే కానీ మంచినీరు కూడా సేవించే వాడు కాదు. ఈతని భక్తికి మెచ్చి ఒక రోజు భక్త దయాళుడైన శ్రీ మహా విష్ణువు దర్శనమిచ్చారు. రామ నాథం స్వామి వారిని చూచి తనమయత్వంలో మునుగి పోయాడు. స్వామివారితో మాట్లాడుతున్నాడే గానీ, ఏమి మట్లాడుతున్నాడో ఏమీ ఎరుకలేదతనికి. స్వామివారే చివరికి నీ ఇంటికి వచ్చిన నన్ను చూస్తూ కూర్చోవడమేనా? నా కేదైనా పెట్టేదుందా? అని అడిగారు. రామనాథం కంగరుగా ఓ అరిటి పండు వలిచి పెట్టాడు.స్వామి అది తిని కొంతసేపటి తరువాత అంతర్థానమయ్యారు. స్వామి వారు వెళ్లిన తరువాత రామనాధం తాను స్వామికి పండు ఇవ్వడానికి బదులు తొక్క ఇచ్చినట్లు గుర్తించాడు. అయ్యో పరధ్యానంలో పొరపాటున స్వామికి తొక్క ఇచ్చి మహా అపరాధం చేశానే అని చాలా విచారించాడు.
కానీ ఏమి చెయ్యగలడు? పొరపాటు జరిగిపోయింది. దానిని సరిదిద్దుకోలేడు.
" జరిగిందేదో జరిగింది. జరిగిన దాని గురించి బాధపడి లాభంలేదు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి " అని నిశ్చయించుకున్నాడు రామనాథం.
మరలా ప్రతీ రోజూ యథాప్రకారంగా స్వామిని ఆరాధిస్తున్నాడు. కొంత కాలానికి మరల రామనాథానికి స్వామి దర్శనమిచ్చారు. అతనికి పూర్వం తాను చేసిన అపరాథం గుర్తుకు వచ్చింది. ఈ సారైనా స్వామికి అరటి పండును సమర్పిద్దామని జాగ్రత్తగా అరటి పండు వలిచి స్వామికి ఇచ్చాడు. స్వామి చిరునవ్వు నవ్వి ఆ పండు ప్రక్కన పెట్టి మాయమై పోయారు. రామనాథం ఆశ్చర్యపోయాడు. ఏమిటీ స్వామి పుర్వం తొక్క ఇస్తే స్వీకరించారు. ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా పండు వలిచి ఇస్తే ప్రక్కన పెట్టి మాయమై పోయారేమిటా అని ఆత్మ విచారణ చేసుకున్నాడు.
అప్పుడు తెలిసింది. మొదటి సారి తొక్క ఇచ్చినప్పుడు రామనాథం మనసు స్వామిపై పూర్తిగా లగ్నమై ఉండడం వల్ల తొక్కను కూడా ప్రీతిగా స్వీకరించారు. కానీ రెండవసారి అతని మనసు అరిటిపండును వలవడంలోనే లగ్నమైంది. కనుక స్వామి ఆ అరటి పండును అతనికే ఇవ్వడం ద్వారా
" నీ మనసు దేనిపై లగ్నమై ఉందో అదే నీకు నేను ఇచ్చేది " అని చెప్పినట్లైంది.
కనుక పూజ చేసే టప్పుడు మనము ఏమి సమర్పిస్తున్నాము అన్న దాని కన్నా, ఎంత భక్తితో, ఏకాగ్రతతో సమర్పిస్తున్నాము అన్నది గ్రహించాలి. మనసు నిలువకుండా చేసే ఎంతటి పుణ్యకార్యమైనా వ్యర్థమే. అలా నిలవాలంటే నామస్మరణ చాలా చక్కని ఉపాయం. నామస్మరణను గూర్చిన మరో చక్కని కథతో " దేవీ పూజావిధానం-2 " రాస్తాను. అంత వరకు సెలవు.
మంచి పని చేస్తున్నారు.
రిప్లయితొలగించండిchala manchi pani chesthunnaru,me katha kuda bagundi.
రిప్లయితొలగించండిdeepavali subhakankshalu
రిప్లయితొలగించండిఅయ్యా శర్మ గారూ...కేశవ నామాలలో జనార్దనాయ నమ: మాత్రమే..
రిప్లయితొలగించండివత్తు లేదు.(జనార్థనాయ నమః కాదు).
దయచేసి సవరించగలరు.
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
అయ్యా శర్మ గారూ...కేశవ నామాలలో జనార్దనాయ నమ: మాత్రమే..
రిప్లయితొలగించండివత్తు లేదు.(జనార్థనాయ నమః కాదు).
దయచేసి సవరించగలరు.
-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
ధన్యవాదాలు శర్మ గారు. సరిదిద్దాను.
రిప్లయితొలగించండిశర్మ గారు చాలా మంచి టపాలు అందచేస్తున్నారు మీకు ధన్యవాదములు ....మీ బ్లాగ్ బాగుంది
రిప్లయితొలగించండిశాస్త్రి గారు ..
రిప్లయితొలగించండిఆచమనం అంటే అర్ధం తెలుసుకోవచ్చా?
నీటిని తీసుకోవటం వదిలివేయటం వెనుక అర్ధం ఏమిటి?
శ్రద్ధ గారు మంచి ప్రశ్న వేశారు. నాకు జటిలమైన ప్రశ్న వేసి నన్ను ఇరుకున పడ వేశారు. :)
రిప్లయితొలగించండిఆచమ్య అంటే -ఆచమనము చేసి అని అర్థం.
ఇక్కడ ‘చం’ అనే ధాతువుకు ముందు ‘ఆ’ అనే ఉపసర్గ, తరువాత ‘య’ అనే ల్యప్ చేరి
ఆచమ్య అయ్యింది.
చం-త్రాగుట/తినుట
చమతి -తాగుచున్నాడు/తినుచున్నాడు
ఆచమనము అంటే నీటిని త్రాగుట.
ఇంతవరకూ నేనూ ఎవరినో అడిగి తెలుసుకుని మరీ రాస్తున్నాను. ఎందుకంటే నాకు సంస్కృత పరిచయమే కానీ, పాండిత్యం లేదు.
ఇక మీ రెండవ ప్రశ్న:
సంధ్యావందన సమయంలో ఎక్కువ సార్లు ఆచమనము చేయవలసి ఉంటుంది. అలాగే ప్రాణాయామము కూడా.
మినప గింజ మునిగే ప్రమాణము గల నీటిని మూడు సార్లుగా శబ్దము రాకుండా స్వీకరించడం వలన ఒకటి దాహము తీరడము, రెండు కంఠము నుండి అన్న నాళము గుండా జీర్ణాశయము వరకు శుద్ధిచేయ బడడము, మూడు మనసుకూడా శుద్ధి అవడము అనే ప్రయోజనాలు నేను గమనించాను.
ఈ మూడవ ప్రయోజనం అంత త్వరగా అవగతమవ్వదు. ఈ ఆచమనము ద్వారా మనసు త్వరగా ఓ నిశ్చలస్థితికి రావడాన్ని నేను స్వయంగా గమనించాను. దీనికి ప్రాణాయామము మరింత సహాయపడుతున్నది. ఈ రెండూ ఎక్కువసార్లు జరపడం వలన త్వరగా మనసు భగవంతుని పై లగ్నమవుతున్నది.
ఇక నీటిని వదలడమంటే చేతిని శుభ్రపరచడం కోసం ఎక్కువ సార్లు చేస్తాము. కానీ " కరిష్యే " అన్నప్పుడు నేను ఈ పూజ చేస్తాను అని నీటి పూర్వక సంకల్పం చేస్తున్నామన్నమాట.
ఇటువంటి మంచి ప్రశ్నలు మరిన్ని మీనుండి రావాలనీ, తద్వారా మన ఆలోచనా శక్తికి మరిన్ని మెరుగులు దిద్దాలనీ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.