పూర్వం రామ నాథం అనే ఒక మహా భక్తుడు ఉండే వాడు. అతడు ప్రతినిత్యం విష్ణు మూర్తి పూజచేస్తే కానీ మంచినీరు కూడా సేవించే వాడు కాదు. ఈతని భక్తికి మెచ్చి ఒక రోజు భక్త దయాళుడైన శ్రీ మహా విష్ణువు దర్శనమిచ్చారు. రామ నాథం స్వామి వారిని చూచి తనమయత్వంలో మునిగి పోయాడు. మాటాపలుకూ లేకుండా అలానే ఉండిపోయాడు. చాలాసేపు చూసిన స్వామివారు " ఏమయ్యా నేను వచ్చేదాకా ఎప్పుడు స్వామిని చూస్తానా!? అని తపించి పోయావు. తీరా వచ్చిన తరువాత ఉలుకూ పలుకూ లేక కూర్చుండి పోయావేమిటి?" అని చిరునవ్వు తో ప్రశ్నించారు. దానికి భక్తుడు "స్వామీ! మిమ్మల్ని చూస్తుంటే ఏమిచెయ్యాలో తోచడం లేదు. మిమ్మల్ని తప్ప ఇంకేమీ చూడ బుద్ధికావడం లేదు. ఏమి మాట్లాడో కూడా తెలియడం లేదు స్వామీ!" అన్నాడు.
స్వామివారే చివరికి "నీ ఇంటికి వచ్చిన నన్ను చూస్తూ కూర్చోవడమేనా? నా కేదైనా తినడానికి పెట్టేదుందా?" అని అడిగారు. రామనాథం కంగరుగా "మన్నించండి స్వామీ! పరధ్యానంలో పడి మరిచిపోయాను" అని, ప్రక్కనే ఉన్న ఓ అరిటి పండు వలిచి పెట్టాడు.స్వామి వారు అది తిని కొంతసేపటి తరువాత అంతర్థానమయ్యారు. స్వామి వారు వెళ్లిన తరువాత రామనాధానికి బాహ్య స్పృహ కలిగింది. ప్రక్కన చూస్తే వలిచిన అరిటిపండు పడి ఉంది. తాను స్వామికి పండు ఇవ్వడానికి బదులు తొక్క ఇచ్చినట్లు గుర్తించాడు. అయ్యో పరధ్యానంలో పొరపాటున స్వామికి తొక్క ఇచ్చి మహా అపరాధం చేశానే అని చాలా విచారించాడు.
కానీ ఏమి చెయ్యగలడు? పొరపాటు జరిగిపోయింది. దానిని సరిదిద్దుకోలేడు.
" జరిగిందేదో జరిగింది. జరిగిన దాని గురించి బాధపడి లాభంలేదు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడాలి " అని నిశ్చయించుకున్నాడు రామనాథం.
మరలా ప్రతీ రోజూ యథాప్రకారంగా స్వామిని ఆరాధిస్తున్నాడు. ప్రతినిత్యం తన తప్పుని తలుచుకుని తలచుకుని స్వామీ! తెలియక చేసిన తప్పుని మన్నించు అని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. కొంత కాలానికి స్వామిక అనుగ్రహంకలిగి మరల రామనాథానికి దర్శనమిచ్చారు. అప్పుడు రామనాధానిక పూర్వం తాను చేసిన అపరాథం గుర్తుకు వచ్చింది. ఈ సారైనా స్వామికి అరటి పండును సమర్పిద్దామని జాగ్రత్తగా అరటి పండు వలిచి స్వామికి ఇచ్చాడు. స్వామి చిరునవ్వు నవ్వి ఆ పండు రామనాధానికే ఇచ్చి మాయమై పోయారు. రామనాథం ఆశ్చర్యపోయాడు. ఏమిటీ? స్వామి పుర్వం తొక్క ఇస్తే స్వీకరించారు. ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా పండు వలిచి ఇస్తే ఓ చిన్న నవ్వు నవ్వి నాకే ఇచ్చి మాయమై పోయారేమిటా!? అని ఆలోచనలో పడ్డాడు. స్వామి నవ్వులో ఏదో నిగూఢార్థం దాగి ఉందని చింతనలో పడ్డాడు.
అప్పుడు తెలిసింది. మొదటి సారి తొక్క ఇచ్చినప్పుడు రామనాథం మనసు స్వామిపై పూర్తిగా లగ్నమై ఉండడం వల్ల తొక్కను కూడా ప్రీతిగా స్వీకరించారు. కానీ రెండవసారి అతని మనసు అరిటిపండును వలవడంలోనే లగ్నమైంది. కనుక స్వామి ఆ అరటి పండును అతనికే ఇవ్వడం ద్వారా
" నీ మనసు దేనిపై లగ్నమై ఉందో అదే నీకు నేను ఇచ్చేది " అని చెప్పినట్లైంది.
పూజకు ముందుగా ఏమేమి కావాలో శ్రద్ధగా సమకూర్చుకోవాలి. ఎంత సమకూర్చుకున్నా ఒక్కోసారి ఏదో లోపిస్తుంది. దానికి చింతించనవసరం లేదు. కానీ ముందు శ్రద్ధగా సామాగ్రి సిద్ధపరచుకోకుండా ఏదో చేశామన్న పేరుకు పూర్తి చేస్తే అది ఫలితమివ్వదు. పూజ చేసే టప్పుడు మనము ఏమి సమర్పిస్తున్నాము అన్న దాని కన్నా, ఎంత భక్తితో ఏకాగ్రతతో సమర్పిస్తున్నాము అన్నది చాలాముఖ్యం. మనసు నిలువకుండా చేసే ఎంతటి పుణ్యకార్యమైనా వ్యర్థమే. అలా నిలవాలంటే నామస్మరణ చాలా చక్కని ఉపాయం. ఇది నేను ఎక్కడో విన్నకథ. నామస్మరణను గూర్చి నేను రాసుకున్న మరో చక్కని పిట్ట కథ త్వరలో రాస్తాను. ధన్యవాదాలు.
కధ పాతదైనా చాలా మంచి కధ. మరో సారి గుర్తు చేసినందుకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిభగవంతుడికి మనము ఏమి సమర్పిస్తే మనకి అదే దక్కుతుంది అనే నమ్మకం (ఆ మాటకొస్తే పరులకిచింది మన పాలు అనే నానుడి ని కుడా ద్రుష్టి లొ ఉంచుకుని) ఉంటేనే మనము చేసే పనిలో ఒక నిబద్ధత, ఒక క్రమ శిక్షణ నేర్చుకోవటం జరుగుతుంది.
రిప్లయితొలగించండినిత్యం దేవునికి దీపం పెట్టటం, నివేదన చెయ్యటం ముందు గా అలవాటు చేసుకుంటే, ఆ క్రతువులో కూడా హడావుడిగా చెయ్యకుండా మనసు కేంద్రీకరించి ఎలా చెయ్యాలో బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తన ప్రసంగం లొ మనసుకి హత్తుకునేట్లు చెప్పారు.ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, వ్యానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా అని మనలో ఉన్న పంచ ప్రాణాలకి నివేదన (జీవాత్మే పరమాత్మ అనే అద్వైత తత్వం ప్రకారం)మన చేత్తో దేవునికి తినిపిస్తున్నట్లు మన మనో ఫలకం మీద చిత్రించు కుంటూ చేసి చూడండి, మీకు కలిగే అనందం స్వయం గా తెలుసుకోండి అని చెప్పారు.
నేను అప్పటి నించి అలా చేస్తూ ఆ అనుభూతి ని పొందుతున్నాను. అది మీతో పంచుకుంటున్నాను.
దైవ భక్తి అనేది కలిగాక, కార్యాచరణ ఎలా ఉండాలి అనేది ఒక క్రమశిక్షణ తో నేర్చుకుంటే మనకి మన సనాతన ధర్మం కరతలామలకం అవుతుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు.
చాల మంచి మాట చెప్పారు, మీ వ్యాసాలు చాల చదివాను, చాలా బావునయ్యి. నాదో చిన్న మనవి. ఒక వ్యాసం కన్నా ఇలాంటి కథల ద్వారా మనసులకి బాగా వంటపడుతుంది. కాబట్టి వీలైతే ఇలాంటి చిన్న కథలు ఇంకా రాయగలరు.
రిప్లయితొలగించండిమీ కధ మనుజులను కొందరినైనా జాగృతం చేస్తుంది.ఇది తధ్యం.
రిప్లయితొలగించండి